మహిళా దినోత్సవం నాడు ప్రధాని మోదీ కానుక ప్రకటించారు. దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగ దారులకు గుడ్ న్యూస్ చెప్పారు. వంట గ్యాస్ పైన రూ 100 మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా దినోత్సవం నాడు ఈ నిర్ణయం ద్వారా కోట్లాది మంది మహిళలకు మేలు జరుగుతుందని వివరించారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. నారీ శక్తికి తమ నిర్ణయం మేలు చేస్తుందన్నారు.
ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఉజ్వల స్కీమ్ ను మరో ఏడాది పాటు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారికి సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని మరో ఏడాది పాటు అందిచనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పుడు ప్రధాని మోదీ మహిళా దినోత్సవం నాడు మరో కానుక ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ప్రతీ వినియోగదారుడికి వంట గ్యాస్ పైన రూ 100 మేర రాయితీ ఇస్తున్నట్లు ట్వట్ చేసారు.
కోట్లాది కుటుంబాలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని వివరించారు. మహిళా సాధికారితకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా మహిళలకు ఆర్దిక భారం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ విజయం పైన కన్నేసిన ప్రధాని మోదీ తొలి నుంచి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 370 సీట్లు గెలవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా, రాజకీయంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగా ఇప్పుడు మహిళా ఓటర్లను ఆకట్టుకొనే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ నెలా వంట గ్యాస్ ధరల పైన మానిటర్ చేస్తూ ధరలను ప్రభుత్వం నిర్ణయం చేస్తోంది. కొద్ది నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరల విషయంలో హెచ్చు తగ్గులు ఉన్నా..డొమెస్టిక్ గ్యాస్ విషయంలో ధరల్లో మార్పు చేయలేదు. ఇప్పుడు, ఎన్నికల సమయంలో..మహిళా దినోత్సవం వేళ ప్రధాని మోదీ సిలిండర్ ధర రూ 100 మేర తగ్గిస్తూ ప్రధాని నిర్ణయం ప్రకటించారు.