కేఏ పాల్ పార్టీలో చేరిన టాలీవుడ్ టాప్ కమేడియన్

దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ నెల రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఈ పరిస్థితుల్లో వివిధ పార్టీల్లో వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న కొద్దీ మరింత ముమ్మరమౌతున్నాయి. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నుంచి ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎంపీలూ పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్/భారతీయ జనతా పార్టీ కండువాలను కప్పుకొంటోన్నారు.

 

ఈ క్రమంలో- తాజాగా ప్రజా శాంతి పార్టీలో చేరికలు చోటు చేసుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ప్రఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్‌కు చెందిన పార్టీ ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగనుంది ప్రజా శాంతి పార్టీ. తెలంగాణలో లోక్‌సభ ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేయబోతోంది.

 

ఈ నేపథ్యంలో- టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు, మాజీ శాసన సభ్యుడు బాబూ మోహన్.. ప్రజా శాంతి పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా కేఏ పాల్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొన్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

 

బాబూ మోహన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గం.. అంధోల్. గతంలో రెండుసార్లు ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహను రెండుసార్లు ఓడించిన జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు.

 

2018లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్. సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌ను అంధోల్ నుంచి పోటీకి దింపింది. టికెట్ దక్కకపోవడంతో బాబూ మోహన్.. బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. కాషాయ కండువాను కప్పుకొన్నారు. అయినప్పటికీ- బీజేపీ అభ్యర్థిగా అంధోల్ నుంచే పోటీ చేశారు గానీ.. ఓడిపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *