దేశవ్యాప్తంగా పలు చోట్ల ఓటుకు నోటు తీసుకుంటున్న ప్రజాప్రతినిధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో 1998లో జేఎంఎం ఎంపీల లంచాల కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరగరాస్తూ కీలక ఆదేశాలు వెలువరించింది. దీంతో ఇకపై లంచాల కేసుల్లో చిక్కే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలాంటి రాజ్యాంగపరమైన రక్షణ లేకుండా కేసుల్ని ఎదుర్కోక తప్పని పరిస్దితి రానుంది.
పార్లమెంట్ తో పాటు చట్టసభల్లో లంచాలు తీసుకున్నట్లు నిరూపణ అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాసిక్యూషన్ ఎదుర్కొని తీరాల్సిందేనని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో 1998లో ఐదుగురు జేఎంఎం ఎంపీలు పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లు వేసేందుకు లంచాలు తీసుకున్నట్లు నిరూపణ అయినా ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణ ఉంటుందంటూ అప్పట్లో సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 ఆర్ఠికల్స్ కు వ్యతిరేకంగా ఉందని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. ఈ రెండు ఆర్టికల్స్ ప్రజాప్రతినిధులు తమ విధుల్ని ఎలాంటి భయం లేకుండా నిర్వర్తించేందుకు చట్టపరమైన రక్షణ కల్పిస్తున్నాయి. కానీ లంచం తీసుకున్నట్లు నిరూపణ అయినప్పుడు ప్రాసిక్యూషన్ చేయకుండా నిరోధించలేవని పీవీ నరసింహారావు కేసును సీజే చంద్రచూడ్ గుర్తుచేశారు.
పార్లమెంటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కల్పించిన రక్షణ లంచాల విషయంలో వర్తించదని ఆయన తెలిపారు. అవినీతి, చట్టసభ సభ్యుల లంచాలు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులని సీజే ధర్మాసనం పేర్కొంది.