ప్రధాని నరేంద్ర మోడీ మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోడీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపింది ప్రధానమంత్రి కార్యాలయం(PMO). మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సింది పీఎంవో సీఎంను కోరింది. దీంతో రేవంత్ హాజరు విషయం ఆసక్తిగా మారింది. కాగా, గతంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా.. ప్రధాని కార్యక్రమాలకు అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సీఎం అయిన తర్వాత తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి స్వాగతం పలికే అవకాశం ఉంది. ఆయనతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నట్లు సమాచారం.
ప్రధాని మోడీ తెలంగాణ షెడ్యూల్:
మార్చి 4న ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదే రోజున ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు ప్రధాని మోడీ. ఇక, మార్చి 5న సంగారెడ్డిలో పర్యటించనున్నా ప్రధాని మోడీ. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
కాగా, రాష్ట్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను బీజేపీ నేతలు ప్రజలకు తెలియజేస్తున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర యాత్రలు సాగనున్నాయి. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.