రైతుల ఛలో ఢిల్లీ మార్చ్.. రెండ్రోజులు వాయిదా..

తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో ఢిల్లీవైపు రైతులు కదం తొక్కారు. ఇటీవలే జరిపిన నాలుగో దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదించిన వాటిని రైతులు తిరస్కరించి మళ్లీ పోరుబాట పట్టారు. తాజాగా పంజాబ్ – హర్యానా సరిహద్దులో జరిగిన ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో దేశరాజధాని దిశగా.. ఛలో ఢిల్లీ పేరిట చేపట్టిన నిరసనను వాయిదా వేసుకున్నారు. రెండురోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రైతులు.. తమ సమస్యలు పరిష్కారమయ్యి, డిమాండ్లు నెరవేరేంతవరకూ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

 

14 వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లతో మొదలైన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్సు, జేసీబీలపై నిరసన కారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో గుమిగూడి.. రక్షణ వలయాన్ని ఛేదించి ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. రైతులను అడ్డుకునేందుకు వాహనాలతో ఏర్పాటు చేసిన బారికేడ్లను వారంతా ధ్వంసం చేసే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు.. నిరసన కారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులతో ఘర్షణలో ఒక యువరైతు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

 

ఈ క్రమంలో ఛల్లో ఢిల్లీ మార్చ్ ను రెండ్రోజులు వాయిదా వేస్తున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు. తదుపరి కార్యాచరణను ఫిబ్రవరి 23, శుక్రవారం చెబుతామని తెలిపారు. ఖనౌరీ-శంభు సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఆయన ఖండించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించమంటే.. ప్రభుత్వం పారిపోతోందని యద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *