విద్య : వేసవి అంటేనే వినోదం. విహారం. స్కూళ్లు, కాలేజీలు ముగిసి వేసవి సెలవులొచ్చాయంటే చాలు పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఆట, పాటలతో సరదాగా గడిపేస్తారు. ఇంటిల్లిపాది కలిసి టూర్లకు వెళ్తారు. మరోవైపు చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అనేక సాంస్కతిక సంస్థలు కార్యక్రమాలను రూపొందిస్తాయి. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి అన్ని రకాల ఆట,పాటలను, ఆనందోత్సాహలను ఇంటికే పరిమితం చేసింది. క్రీడా ప్రాంగణాల్లో, సాంస్కృతిక కేంద్రాల్లో గడపాల్సిన పిల్లలు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పలు సంస్థలు, వ్యక్తులు ఆన్‌లైన్ వేసవి శిబిరాలను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు వివిధ వయసులకు చెందిన పిల్లల అభిరుచికి అనుగుణమైన కార్యక్రమాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాయి. మరికొన్ని సంస్థలు ఆ దిశగా కార్యాచరణ చేపట్టాయి. ఇంటికే పరిమితమైన పిల్లలకు కనీసం ఆన్‌లైన్ శిక్షణనిప్పించడం ద్వారా రొటీన్‌కు భిన్నమైన వాతావరణాన్ని కల్పించినట్లవుతుందని తల్లిదండ్రులు సైతం ఆన్‌లైన్ సమ్మర్ క్యాంపుల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు