హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సమయంలో లెక్కించాల్సిన ఐదు వీవీప్యాట్ యంత్రాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో రజత్ కుమార్ మాట్లాడుతూ..మొదట సర్వీసు ఓటర్ల ఎలక్ట్రానిక్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈవీఎం, వీవీప్యాట్లలో తేడా ఉంటే వీవీప్యాట్ ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నందున మల్కాజ్గిరిలో 24, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున నిజామాబాద్లో 18 ఓట్ల లెక్కింపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రజత్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం సలహాదారు భన్వర్లాల్తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.
