దేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం గవర్నర్.. సైనిక వందనాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన వారికి పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నియంతృత్వ పాలనకు తెర పడిందంటూ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా, కొనసాగిన 10 సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు తెలంగాణ సమాజం తెర దించిందని గవర్నర్ అన్నారు. గత ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పరిపాలించిందని చెప్పారు. పదేళ్ల గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని దైన్య స్థితిలో ప్రజలు గడిపారని అన్నారు.
పేదల కన్నీళ్లు తుడవడానికి ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థ అందుబాటులో ఉండేది కాదని గవర్నర్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించే ప్రభుత్వాలను ఓడించే అధికారాన్ని ఈ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును తెలంగాణ సమాజం సద్వినియోగం చేసుకుందని చెప్పారు.
ఇటీవలే ముగిసిన ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైందని కితాబిచ్చారు. దురహంకార ప్రభుత్వానికి చరమగీతం పాడారని, నియంతృత్వ ధోరణికి చోటు లేదంటూ తెలంగాణ ప్రజలు స్వాగతించదగ్గ తీర్పును ఇచ్చారని అన్నారు. పదేళ్ల నియంతృత్వ ప్రభుత్వంలో ధ్వంసమైన రాజ్యాంగాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యి విలువలను పునరుద్ధరించుకునేలా పరిపాలన సాగుతుందనే ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. అభివృద్ధి, ప్రజాస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను కల్పిస్తుందని, అసమానతలను తొలగిస్తుందని అన్నారు. పేదల గొంతుకను వినడానికి కొత్త ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని గుర్తు చేశారు.