రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా రిలీజ్ డేట్ కోసం నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించింది. జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఛాంబర్ పెద్దల నిర్ణయం కోసం సంక్రాంతి బరి నుంచి వైదొలిగింది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. అదే రోజు కొన్ని చిత్రాలు విడుదలవుతున్నట్టు ప్రకటించాయి. తమకు ఇచ్చిన ‘సోలో రిలీజ్ డేట్’ మాట నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఫిల్మ్ ఛాంబర్‌ను కోరింది. ఈగల్ నిర్మాణ సంస్థ తమకు సోలో డేట్ వచ్చేలా సహకరించాలని లేఖ రాసింది.
‘ఈగల్’ సినిమా వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రవితేజ విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటించారు. నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి.