ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు..–: కేటీఆర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇప్పటికే విరుచుకుపడుతున్న కేటీఆర్ తనదైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా సరే వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పాలనను టార్గెట్ చేస్తున్నారు.

 

ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. బిజెపి ఆదేశాల మేరకు అదానీతో రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఆదానీతో కొట్లాడుతూ, తెలంగాణలో మాత్రం అదానీతో ఎందుకు కలిసి పని చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

ఎన్నికల ముందు అదానీ దొంగ అని విమర్శించిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత దావోస్ సాక్షిగా అలాయ్ బలాయ్ చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు రుణమాఫీ దశల వారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని కేటీఆర్ విమర్శించారు.

 

బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు ఆస్తులు సృష్టించిందని పేర్కొన్న కేటీఆర్ బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్ కు అప్పగించామన్నారు. ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడే పరిస్థితులు మళ్ళీ వచ్చాయని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనను గమనిస్తున్నారని, త్వరలోనే కచ్చితంగా తిరగబడతారని, ఆరు నెలల్లో అది జరిగి తీరుతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *