తెలంగాణలో రైతు బంధు నిధుల జమ పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెద్ద సంఖ్యలో రైతులు రైతుబంధు నిధుల కోసం వేచి చూస్తున్నారు. నిధుల లభ్యతకు అనుగుణంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీని పైన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతు రుణమాఫీ పైనా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రణాళికల గురించి మంత్రి వివరించారు.
నెలాఖరులోగా పూర్తి రైతు రుణబంధు గురించి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. గత నెలలోనే రైతు బంధు నిధుల జమ ప్రారంభించారు. ఈ నెల మొదటి వారంలో ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాల కోసం రైతు బంధు నిధుల జమలో ఆలస్యం జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటిదాకా 30 లక్షల మంది ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమ చేశామని తుమ్మల తెలిపారు. ఇంకా ఈ సాయం అందని వారందరికీ ఈ నెలాఖరులోగా నిధుల జమ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. మొత్తం 70 లక్షల మందికి జమ చేయాల్సి ఉంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం దాదాపు 40 లక్షల మంది రైతుల కు సాయం అందాల్సి ఉంది. ఇప్పుడు తుమ్మల చేసిన ప్రకటనతో రైతులకు ఉపశమనంగా మారనుంది.
రుణమాఫీ పైనా కసరత్తు ఇక, రుణమాఫీ పైనా మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. ఇందు కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు రూ.32 వేల కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. నిధుల సమీకరణ దిశగా: రాష్ట్ర వ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు.
ప్రభుత్వ ప్రణాళికలు బ్యాంకర్లతో మాట్లాడి.. ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతోంది. దీని ద్వారా ముందుగా రైతుల పేరుమీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదికి బదలాయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని.. వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పలా మారిన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు. దీంతో, సీఎం రేవంత్ కొత్త నిర్ణయం అమలుకు నిర్ణయించారు. రైతు రుణమాఫీ కోసం ఒక ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ముందుగా బ్యాంకు నుంచి రైతురుణమాఫీకి కావాల్సిన నిధులు సమీకరించి..రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నారు. తరువాత ప్రభుత్వ ఆదాయ శాఖల నుంచి కొంత మేర సెస్ రూపంలో ఈ రుణమాఫీ ఖాతాకు జమ చేసేలా ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.