నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం..

టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అధినేత పర్యటనతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాలుగు మండలాలను చుట్టేయనున్నారు చంద్రబాబు. ఆరు నెలల తర్వాత అధినేత సొంత నియోజకవర్గానికి రానుండటంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.

 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు టీడీపీ నేతలు. నాలుగు చోట్ల బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ గుడుపల్లె మండలం, రేపు శాంతిపురం, రామకుప్పం, ఎల్లుండి మల్లానూరులో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది టీడీపీ.

 

చంద్రబాబు పర్యటనలో ప్రజలను కలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ ముఖ్య నేతలు, మండల, క్లస్టర్‌, యూనిట్‌ బాధ్యులతో సమావేశం కానున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్ఠత.. రానున్న ఎన్నికల సమరానికి శ్రేణులను సన్నద్ధం చేయడం..భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.

 

జనసేన నాయకులు, కార్యకర్తలతో పరిచయ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. స్కిల్‌ కేసులో అరెస్టయిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబుకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేశారు. నాలుగు మండలాలతోపాటు కుప్పంలో ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లు, పార్టీ జెండాలతో పసుపుమయం చేశారు. మండల కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా డిజిటల్‌ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *