కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలాన్ని తట్టుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా బుధవారం భారీగా లాభపడింది. మన దగ్గర కూడా కేంద్రం ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదని, ఆర్‌బీఐ 60 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించనున్నదన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరొక్క రోజులో ముగియనుండటంతో భారీగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఇంట్రాడేలో 2,116 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 1,862 పాయింట్ల లాభంతో 28,536 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 517 పాయింట్లు పెరిగి 8,318 పాయింట్ల వద్దకు చేరాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 6.98 శాతం, నిఫ్టీ 6.62 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు లాభపడటం ఇది గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. కాగా గుడిపడ్వ పర్వదినం కారణంగా ఫారెక్స్ మార్కెట్ బుధవారం పనిచేయలేదు.
నష్టాల్లోంచి… భారీ లాభాల్లోకి
ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా మన మార్కెట్ నష్టాల్లోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 174 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 11 తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చిన సూచీలు ట్రేడింగ్ చివరి వరకూ లాభాల జోరును కొనసాగించాయి. ఒక దశలో 314 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 2,116 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 2,430 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కాగా భారత్‌లో కోవిడ్–19 వైరస్ కేసులు 562కు, మరణాలు 10కు పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కేసులు 4.34 లక్షలకు, మరణాలు 19,600కు, రికవరీలు లక్షకు చేరాయి.