కరోనా వైరస్ నియంత్రణకు జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా ప్రజలకు సరఫరా చేస్తున్న ఆహార ధాన్యాల కోటాను రెండు కిలోల చొప్పున పెంచింది. ఇప్పటి వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద సబ్సిడీ ధరలపై 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల చొప్పున సరఫరా చేస్తున్నది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం ప్రతి ఒక్కరికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద 7 కిలోల ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమలు రూ.27లకు లభిస్తుండగా, సబ్సిడీ ధరపై రూ.2లకు, కిలో బియ్యం మార్కెట్‌లో రూ.32లకు లభిస్తుండగా సబ్సిడీ ధరపై రూ.3లకు పంపిణీ చేయాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు చెప్పారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్బీ)ను బలోపేతం చేయాలని సీసీఈఏ నిర్ణయించింది. ఆయా బ్యాంకుల్లో రూ.1340 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆమోదం తెలిపింది.