రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వారిని క్షమించం..

రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్‌ను ప్రజలు క్షమించరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మన రాతలు తిరగరాసుకునే శక్తి మన చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉంటే బానిసలుగా ఉండాల్సిన పరిస్థతి ఉంది, లేదంటే రాష్ట్రాన్ని వదిలి పారిపోయే ఖర్మ ప్రజలకేంటని తీవ్రంగా మండిపడ్డారు.

 

తణుకు,పెదకూరపాడు, అమలాపురం, గజపతినగరం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లడుతూ.. తన సినిమా అయిపోయిందని జగన్‌కు కూడా అర్థమైందన్నారు. అందుకే వైఎస్సార్సీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రజలు జగన్‌ని మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని బాబు ఎద్దేవా చేశారు.

 

జగన్ మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏమో మహిళల భర్తలు, బిడ్డలతో ఏళ్ల తరబడి తాగించేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ పారిపోయాయి, ఒక్కరికీ ఉద్యోగం రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోనే రూ.40వేల కోట్ల భూ కబ్జాలు జరిగాయన్నారు. ఆ భూ దందాలన్నీ 22ఏ నిబంధన ఉల్లంఘించే జరిగాయని బాబు ఆరోపించారు.

 

ఓట్ల దొంగలు వచ్చి బతికున్న వారినీ చంపేస్తున్నారని దుయ్యబట్టారు. పెదకూరపాడు ఎమ్మెల్యే జగన్‌కు బినామీగా రెండు జిల్లాల్లో ఇసుక కొల్లగొట్టాడని ధ్వజమెత్తారు. కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసిన ఇసుక మాఫియా వైఎస్సార్సీపీదని మండిపడ్డారు. ఒకప్పుడు రొయ్య మాదిరి మీసాలు మెలేసిన ఆక్వా రైతులు ఇప్పుడు పూర్తిగా చితికిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే యజ్ఞాలు, హోమాలు పూజలు చేశానని…తన కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.

 

అక్రమ కేసులకు భయపడి ప్రజలు బయటకు రాకుంటే, మీ జీవితాలకు మీరే మరణ శాసనం రాసుకున్నట్టని చంద్రాబాబు పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాను అందరి వాడిని కానీ ఏ ఒక్కడి వాడిని కాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉంటే తాను అక్కడ ఉంటానని స్పష్టం చేశారు. 40ఏళ్ల రాజకీయ అనుభవంతో కష్టపడి, ప్రజల కష్టాలు తీర్చుతానని చెప్పారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కాపీ కొట్టి జగన్‌ అమలు చేస్తానంటున్నారని బాబు విమర్శించారు.

 

ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినంత మాత్రాన నిత్యావసరాలు, అధిక బిల్లులు, ధరలు రూపేణా దోచింది తిరిగి ఇస్తాడా అని బాబు నిలదీశారు. రాబోయే మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖకు మారుస్తాడా? అని ఆయన ప్రశ్నించారు. కోర్టులు చీవాట్లు పెట్టినా సిగ్గుపడట్లేదని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 5కోట్ల మంది ప్రజలకు.. జగన్మోహన్ రెడ్డికి మధ్య అని బాబు చెప్పారు. జగన్ లా విలువలు లేని రాజకీయాలు ఎవ్వరూ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *