ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ (VV Lakshmi Narayana) తాను కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. జై భారత్ నేషనల్(JBNP) పేరిట కొత్త పార్టీని ఆయన శుక్రవారం ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నా.. రాజకీయాలు అంటే మోసం కాదు.. సుపరిపాలన అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరుద్యోగానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాకపోవడమేనని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయన్నారు లక్ష్మీనారాయణ. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జైభారత్ నేషనల్ పార్టీ అని స్పష్టం చేశారు. వీళ్లు తిన్నారని వాళ్లు.. వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారని మండిపడ్డారు.
ఎవరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించినట్లు తెలిపారు. అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు.. బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జేబీఎన్‌పీ అని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కొత్త పార్టీతో లక్ష్మీనారాయణ ముందుకు రావడం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశం ఇలా
కాగా, మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ పై వెళ్లి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో సొంత రాష్ట్రమైన హైదరాబాద్‌లో విధుల్లో చేరారు. ఆ తర్వాత సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా సంచలన కేసుల్లో దర్యాప్తు చేపట్టి కీలకంగా వ్యవహరించారు. పలు కీలక కేసుల దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఈ క్రమంలో జనసేన పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు లక్ష్మీనారాయణ. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీని వీడారు. ఆ తర్వాత కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నారు. ప్రజలు, రైతులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు లక్ష్మీనారాయణ. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త పార్టీని ప్రకటించడం గమనార్హం.