తేది:13-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “Arrive Alive” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ:
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ చేపడుతున్న “Arrive Alive” కార్యక్రమం ప్రశంసనీయమని తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా, నియమ నిబంధనలు పాటిస్తూ ప్రయాణిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.రోడ్డు భద్రత ఒక్క పోలీస్ శాఖ బాధ్యత కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. “వేగం ప్రాణం తీస్తుంది” అనే విషయాన్ని గుర్తుంచుకుని అధిక వేగంతో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ:
ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘు చందర్, ఆర్టీఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, ఎస్.ఐలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సుమారు 300 మంది విద్యార్థులు మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు.