అన్ని పార్టీలకు ప్రధాని మోదీ లేఖ..! మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ పార్లమెంటు ఉభయసభల పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ లేఖ రాశారు. బిల్లు ఆమోదానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ

 

నారీ శక్తి వందన అధినియం పిలువబడే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ పార్లమెంటు ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ రాశారు ప్రధానమంత్రి మోదీ . ఈ బిల్లు కోసం ఏప్రిల్ 16 నుండి 18 వరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ప్రధాని అన్ని పార్టీలకు లేఖలు రాశారు.

 

చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేసింది మోదీ ప్రభుత్వం. 2029 సార్వత్రిక ఎన్నికలలోపు ఈ బిల్లు అమలు చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ బిల్లుకు ఏకగ్రీవంగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభ-రాజ్యసభ లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖలు రాశారు ప్రధాని. ఈ బిల్లు ఆమోదం పొందడం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తుందని ప్రస్తావించారు.

 

మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ పార్టీలకు విజ్ఞప్తి

 

మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్న మన సమిష్టి నిబద్ధతను చాటుకోవాల్సిన సమయమని ప్రస్తావించారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ, నిర్ణయాధికారంలో చురుకైన పాత్ర పోషించినప్పుడే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు.

 

ఈ చట్టం ఉద్దేశం, స్ఫూర్తిలోనూ పూర్తిస్థాయిలో అమలు పరిచే సమయం ఆసన్నమైందన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో ఉండగానే జరగడం ముఖ్యమన్నారు. రిజర్వేషన్ల అమలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో నిపుణులు- రాజకీయ పార్టీలతో విస్తృత చర్చల అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని తెలిపారు.

 

దేశ మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును 2027 జనాభా లెక్కలతో ముడిపెట్టకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలన్నది కేంద్ర ఆలోచన. దీనివల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా కోటాను అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. ఈ అంశం ఒక్క పార్టీకో, వ్యక్తికో సంబంధించినది కాదన్నారు.

 

మహిళలు, భావి తరాల పట్ల మనందరి బాధ్యతని ప్రస్తావించారు. ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకునే అవకాశం వదులుకోవద్దన్నారు. ఈ సవరణకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్య సంప్రదాయాలను మరింత బలోపేతం చేద్దామన్నారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావడంతో ప్రతిపక్షాల మద్దతు ఈ బిల్లు కీలకం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *