కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ జెండాకు కలర్ ఫిక్స్..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ జెండా, ఎజెండాలో నీలిరంగు ఉండబోతుంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమ దర్శనికతకు, మాట ఇస్తే తుది వరకు కట్టుబడి ఉండే నమ్మకత్వానికి నీలం రంగు చిహ్నం అని పేర్కొన్నారు. కలర్ థియరీ అనే హాష్ ట్యాగ్ ను తన పోస్ట్ కు జత చేశారు. ఈనెల 25న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వేషన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా కవిత నిజామాబాద్ లో ప్రకటించారు.

 

నీలి రంగు..

రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లలో వేగం పెంచారు. వివిధ వర్గాల ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తన రాజకీయ పార్టీ జెండా, ఎజెండా రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఈక్రమంలోనే ఎక్స్ వేదికగా తమ పార్టీ జెండా, ఎజెండాలో నీలి రంగు ఉండబోతుంది అన్న సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థలోని ఆకుపచ్చ రంగు పచ్చదనానికి, వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి నిదర్శనం అయితే.. నీలిరంగు బడుగు బలహీన వర్గాల వికాసం, సమున్నతికి సూచిక అని తెలుస్తోంది. సామాజిక తెలంగాణ – సర్వోదయ వికాసం ఎజెండాగా, తెలంగాణ ఫస్ట్ సిద్ధాంతంగా తమ పార్టీ ఉంటుందని ఇప్పటికే కవిత పలు సందర్భాల్లో వెల్లడించారు.

 

ఉమ్మడి జిల్లాల వారీగా..

పార్టీ ఏర్పాటు వేదికపై తమ పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉందని జాగృతి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సమాలోచనలు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపారు. పార్టీ ఏర్పాటు కోసం వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వాటికి పరిష్కారాలు, తెలంగాణ రాష్ట్ర స్వయం సమృద్ధి కోసం రూపొందించాల్సిన బ్లూ ప్రింట్ పై 50 కమిటీలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలతో జెండా, ఎజెండా సైతం ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అయితే జెండా, ఎజెండాలో నీలిరంగు ఉంటుందని కవిత హింట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జాగృతి శ్రేణుల్లో సైతం ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *