కరోనా వైరస్ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వ్యాపిస్తోంది. దీంతో వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిపై నిఘా పెట్టాలని కేంద్రం మొత్తుకుంటోంది. తగిన పరీక్షలు నిర్వహించుకుని, క్వారంటైన్‌లో ఉండాలని రాష్ట్రమూ పదేపదే చెబుతోంది. చివరికి… విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకూ, నిఘాలో ఉన్న వారి సంఖ్యకు మధ్య వ్యత్యాసం చాలా ఉందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పేర్కొన్నారు. ఎక్కడో తేడా కొడుతోందని… దీనిపై ఆరా తీయాలని శుక్రవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. కేంద్రం అనుమానం అక్షరాలా నిజం. ఎందుకంటే… ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 453 ‘విదేశీ ప్రయాణికులు’ కనిపించడంలేదు. వారంతా ఏమయ్యారో, ఎటు వెళ్లారో అంతుచిక్కడం లేదు.
దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి విశాఖకు వివిధ మార్గాల్లో వచ్చిన వారి వివరాలను జిల్లా అధికారులు సేకరించారు. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నగరానికి వచ్చినప్పుడు విదేశాల నుంచి మొత్తం 3,746 మంది విశాఖ వచ్చారని ప్రకటించారు. వారిని మండలాల వారీగా విభజించి, ఆ జాబితాలను ఆయా తహసీల్దార్లకు పంపించి సర్వే చేయిస్తున్నామని చెప్పారు. వారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అత్యధికంగా విశాఖ అర్బన్ జిల్లాలో 649 మంది, గాజువాక మండలంలో 476 మంది ఉన్నారని తెలిపారు.