తేది:11-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి .
జగిత్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించేందుకు, వ్యసనానికి గురైన వ్యక్తులను తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి హెల్త్ మరియు పోలీస్ శాఖలు సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ సమస్య ఒక పెద్ద సవాలుగా మారిందని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా “ఈగల్ టీం”ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందం ద్వారా డ్రగ్స్ నియంత్రణ, అవగాహన కార్యక్రమాలు, పర్యవేక్షణ చర్యలు మరింత బలోపేతం చేయబడుతున్నాయని వివరించారు.మత్తు పదార్థాల వినియోగం వలన ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎస్పీ గారు పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలన అనేది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య మాత్రమే కాకుండా ఇది ఒక సామాజిక సమస్య, ప్రజా ఆరోగ్య సమస్య కూడా అని స్పష్టం చేశారు. కావున దీన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ముఖ్యంగా యువత ఈ వ్యసనాలకు గురికాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు వ్యక్తి జీవితాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదకరమైన అలవాటు అని పేర్కొంటూ, డి-అడిక్షన్ సెంటర్ అనేది వ్యసనానికి గురైన వారికి ఒక రెండవ అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు.అదేవిధంగా జిల్లాలో మత్తు పదార్థాల సరఫరా, రవాణా, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ఎవరైనా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎక్కడైనా మత్తు పదార్థాల వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ యువత దేశానికి అతి పెద్ద సంపద అని, యువత సన్మార్గంలో నడవడం చాలా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి మార్గంలో నడుచుకుంటూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు ప్రత్యేక వార్డులను డి-అడిక్షన్ సెంటర్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సెంటర్లో ఎంత సీరియస్ కేసులైనా సమర్థవంతంగా చికిత్స అందించే నిపుణ వైద్యులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. చికిత్సతో పాటు అవసరమైన మందులు, సేవలు ప్రభుత్వం తరఫున ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.యువత బాగుంటేనే దేశం బాగుంటుందని, అందువల్ల యువత మత్తు పదార్థాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మత్తు పదార్థాల నిర్మూలన మరియు వాటి వల్ల కలిగే దుష్పరిణామాలపై నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎస్పీ గారు మరియు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైద్యులు, పోలీస్ అదికారులు, సిబ్బంది పాల్గొన్నారు.