తేది:11-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు.శనివారం సమీకృత జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ:ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా విప్లవానికి నాంది పలికిన ఆయన మహిళల విద్యకు ప్రాధాన్యతనిస్తూ తొలి బాలికల పాఠశాలను స్థాపించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి శ్రమించి, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపట్టారు.
దేశంలోని అణగారిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ప్రస్తుత ప్రభుత్వానికి మార్గదర్శకమని అన్నారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహనీయుల జయంతుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేదలు, దళితులు, బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, సామాజిక న్యాయం రంగాల్లో ఫూలే గారి ఆశయాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా విద్యా రంగంలో మరియు మహిళాభివృద్ధి కొరకు అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. జిల్లాకు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రెసిడెన్సియల్ పాఠశాల అడ్మిషన్స్ కొరకు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నా అవకాశం కలిపించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.ప్రతి ఒక్కరూ మహాత్మా ఫూలే గారి ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజంలో సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహాత్మ జ్యోతి బా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు.
ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ:మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. విద్యా విస్తరణ, మహిళల సాధికారత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని అన్నారు.
ప్రస్తుత తరంలో యువత ఫూలే గారి ఆశయాలను అవలంబించి సమాజంలో మార్పు తీసుకురావాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అదే దిశగా కొనసాగుతున్నాయని తెలిపారు.
జిల్లాలో మహాత్మ జ్యోతి రావు పూలే మరియు సావిత్రి బాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు కృషి చేశామని తెలిపారు.
జ్యోతి రావు పూలే మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాతోనే వికాసం అనే నానుడితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జగిత్యాల పట్టణానికి కాలేజీ, పాఠశాలల బిల్డింగ్ ల నిర్మాణాలకు తోడ్పడుతున్నందుకు మరియు జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యత, మహిళల సాధికారత కోసం చేసిన కృషి అపారమని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన దారి నేటికీ ప్రాసంగికమైందని పేర్కొన్నారు. నేడు అమలు చేస్తున్న 33% మహిళా రిజర్వేషన్లు తీసుకురావడానికి అప్పటి సంస్కరణలే కారణమని అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఫూలే గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం రంగాల్లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. వారి కృషిని, స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
అంతకంటే ముందు జగిత్యాల జిల్లా ‘కళాజాత’ కళాకారుల బృందం మహనీయులను స్మరిస్తూ పాటలతో అందరిని అలరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్. లత, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా బి.సి వెల్ఫేర్ అధికారి జి. సునీత, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ ఏ.వో కిషన్, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు మరియు తదితరులు పాల్గొన్నారు.