ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి, ఫిర్యాదుల్లో వాస్తవికతను తెలుసుకున్నారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-1లోని తాజ్ బంజారా లేక్‌ను పరిశీలించారు. అనంతరం శంషాబాద్ మండలం మామిడిపల్లిలోని చెరువులు, వరద కాలువల ఆక్రమణలను పరిశీలించారు. తాజ్ బంజారా హోటల్ ముందున్న బంజారా లేక్ ఆక్రమణలకు గురికావడంతో పాటు పూర్తిగా కలుషితమై దుర్గంధభరితంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షంచారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్..
కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. చెరువులోకి నేరుగా మురుగు నీరు చేరడం, పై నుంచి కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్‌తో చెరువు సగానికి పైగా నిండి ఉండడాన్ని కమిషనర్ గమనించారు. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న బంజారాలేక్ ఇలా దుర్గంధభరితంగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెరువు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే అత్యంత కలుషితమైన జలవనరుగా మారిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్‌టీఎల్ పరిధిలోనే రహదారి నిర్మించడం, వ్యర్థాలను వేయడంతో చెరువు ఉనికికి ప్రమాదం ఏర్పడిందన్నారు. కట్టమైసమ్మ దేవాలయానికి వెళ్లే దారిని కూడా ఆక్రమణదారులు మూసివేయడంపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన తీవ్రంగా పరిగణించారు.
విచారించి చర్యలు తీసుకుంటాం
బంజారాలేక్ పై భాగంలో ప్రభుత్వ భూమి కూడా ఉంది, ఆ భూమిని కాపాడడంతో పాటు చెరువు పునరుద్ధరణకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. నివాసాల జోలికి వెళ్లకుండా, చెరువును పరిరక్షిస్తామని చెప్పారు. నాలాలను మూసివేసి వరద ముప్పునకు కారణమయ్యే నిర్మాణాలపై ఖిచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో పాటు ఆక్రమణలకు పాల్పడిన వారిని కూడా పిలిచి పారదర్శకంగా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఈ చెరువు అభివృద్ధి విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే చెరువు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అంతకు ముందు అక్కడ కట్టమైసమ్మ ఆలయానికి వెళ్లే మార్గం లేకుండా తాజ్ బంజారా హోటల్ వాళ్లు నియంత్రిస్తున్నారని ఎమ్మెల్యేతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఫిర్యాదు చేశారు. చెరువు పునురుద్ధరణను హైడ్రా చేపట్టాలని డిమాండ్ చేశారు. చెరువు పై ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడి పార్కుగా అభివృద్ధి చేయాలని పలువురు కోరారు.
మామిడిపల్లిలో చెరువుల అన్యాక్రాంతంపై..
శంషాబాద్ మండలం మామిడిపల్లి పరిసరాల్లో నాలుగైదు చెరువులు మాయమయ్యాయని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒంగోని కుంట, కనకయ్యకుంట, మర్రివాణికుంట, ఎర్రకుంటలో కొన్ని వాటర్ బాడీలను పూర్తిగా ఆక్రమించడాన్ని సీరియస్‌గా పరిగణించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి, ఇక్కడి చెరువులు, వరద కాలువల గురించి పూర్తి సమాచారం సేకరించాలని సూచించారు. ఈ చెరువులను కలుపుతూ సాగే వరద కాలువలను కబ్జా చేయడం లేదంటే ఇష్టానుసారంగా మూసేయడంతో వర్షాకాలం వరద ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో నివాసాలు నీట మునుగుతున్నాయనే ఫిర్యాదులను కూడా పరిశీలించారు. ఆక్రమణదారులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి కబ్జాలను తొలగించాలని సూచిస్తామని, లేని పక్షంలో హైడ్రా నేరుగా రంగంలోకి దిగుతుందని స్థానికులకు చెప్పారు. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలని హైడ్రా అధికారులను కమిషనర్ ఆదేశించారు.