ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తున్న తరుణంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడం రాష్ట్రానికి పెను భారమని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మావిగన్ లేదా అయోధ్య..? పేర్ని నాని ప్రతిపాదన
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో సూచించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కాన్సెప్ట్ ఉత్తమమని నాని పేర్కొన్నారు. ఒకవేళ ఆ పేరు పట్ల అభ్యంతరాలు ఉంటే.. దానికి ‘అయోధ్య’ అని పేరు పెట్టాలని వినూత్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కేవలం ఒకే ప్రాంతంలో వేల కోట్లు కుమ్మరించడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ప్రధాన నగరాల కలయికతో ఏర్పడే ప్రాంతం అభివృద్ధికి తక్కువ ఖర్చు అవుతుందని ఆయన వాదించారు.
పేర్నినాని ఫైర్..
రాష్ట్రానికి అమరావతి ఒక గుదిబండలా మారుతోందని జగన్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్ని నాని విమర్శించారు. గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు నగరాల మధ్య ఉన్న భూములను వినియోగించుకుంటే మౌలిక సదుపాయాల కల్పన సులభం అవుతుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తన పట్టుదలను వీడి.. ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్.. టీడీపీ నేతల ఆగ్రహం
పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అసలు వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికైనా అర్థం అవుతోందా అని ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లు మూడు రాజధానుల పేరుతో కాలాన్ని వృధా చేసి.. ఇప్పుడు కొత్తగా ‘మావిగన్’ అనే వింత పేరును తెరపైకి తేవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేస్తున్నారు.
అమరావతిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపించింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పేర్ని నాని మాటలపై రకరకాల మీమ్స్ సృష్టిస్తున్నారు. ‘అయోధ్య పేరు చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉన్నారా?’ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
రాజధాని విషయంలో వైసీపీ అనుసరిస్తున్న తీరు గందరగోళంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు విశాఖపట్నం అని చెబుతూనే.. మరోవైపు విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతం గురించి మాట్లాడటం రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోంది. అభివృద్ధిని వికేంద్రీకరించడం కంటే.. ప్రస్తుత రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడమే ప్రధాన అజెండాగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిపై దృఢ సంకల్పంతో ఉండటంతో.. ఇలాంటి ప్రతిపాదనలు కేవలం చర్చలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.