హర్మూజ్ జలసంధి తెరవకపోతే పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి చూస్తారు: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు నేరుగా, కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. హర్మూజ్ ను ఇప్పటికైనా తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

 

“ఇరాన్‌లో మంగళవారం నాడు పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి ఉంటాయి. అలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు” అని ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు. “హర్మూజ్ జలసంధిని తెరవండి, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. మీరే చూస్తారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇరాన్ కు ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే.

 

అయితే, ట్రంప్ దూకుడు వైఖరిపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం వల్ల దేశం మరో సుదీర్ఘకాల సంక్షోభంలోకి జారుకుంటోందని మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఎస్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “మనం ప్రమాదకరంగా మరో శాశ్వత యుద్ధంలోకి వెళుతున్నాం. అసలు మన లక్ష్యం ఏంటో, ఏ లక్ష్యం సాధిస్తే విజయం అనాలో ఎవరికీ స్పష్టత లేదు” అని అన్నారు. ఈ యుద్ధం వల్లే గ్యాస్ ధరలు డాలర్‌కు పైగా పెరిగాయని, ఇది ప్రజలపై భారం మోపుతోందని ఆయన తెలిపారు.

 

మరోవైపు, అమెరికా బలగాలకు సేవలందించే క్యాథలిక్ చాప్లిన్‌ల పర్యవేక్షకుడు, ఆర్చ్‌బిషప్ తిమోతి బ్రోగ్లియో ఈ యుద్ధానికి నైతిక సమర్థన లేదని స్పష్టం చేశారు. “ధర్మబద్ధమైన యుద్ధ సిద్ధాంతం (జస్ట్ వార్ థియరీ) ప్రకారం ఇది సరైంది కాదు. ముప్పు పూర్తిగా ఏర్పడక ముందే మనం స్పందిస్తున్నాం” అని అన్నారు. ఈ ఘర్షణలో అమాయక పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధానికి మతపరమైన రంగు పులమడం సరికాదని, ఏసు ప్రభువు శాంతి సందేశాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *