తెలంగాణ విద్యార్థులకు సర్కార్ విద్యా కానుక..! 24 వస్తువులతో కిట్..

సర్కార్ స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త వరాలను ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) ప్రారంభం నాటికే విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన ‘స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్స్’ అందించాలని నిర్ణయించింది. కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యార్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ కిట్లలో వస్తువులను పొందుపరచడం విశేషం. జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

 

ఒక్కో కిట్‌లో 24 వస్తువులు..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), మోడల్ స్కూల్స్, గిరిజన విద్యాలయాల్లో చదివే సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రత్యేక కిట్లు అందనున్నాయి. ఈ కిట్‌లో విద్యార్థికి రోజువారీ అవసరమైన 24 రకాల వస్తువులను చేర్చారు. ఇందులో పాఠశాల యూనిఫాం, వైట్ డ్రెస్, షూస్, సాక్సులతో పాటు ట్రాక్ సూట్, నైట్ డ్రెస్, టై, బెల్ట్ వంటి దుస్తులు ఉంటాయి. అంతేకాకుండా, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం బెడ్ షీట్, బ్లాంకెట్, టవల్ వంటి వసతి సౌకర్యాలకు సంబంధించిన వస్తువులను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది.

 

భోజన వసతి నుంచి స్టేషనరీ వరకు అన్నీ ఒకేచోట..

విద్యార్థులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కిట్‌లో భోజన సామాగ్రిని కూడా చేర్చింది. ప్లేట్, గ్లాస్, కప్పు, స్పూన్ వంటి వస్తువులతో పాటు.. వారి పుస్తకాలు, బట్టలు భద్రపరుచుకోవడానికి ఒక ట్రంక్ బాక్స్ కూడా ఇస్తారు. వీటితో పాటు నాణ్యమైన స్టేషనరీ కిట్, నోట్‌బుక్స్ కూడా ఈ 24 వస్తువుల జాబితాలో ఉన్నాయి. దీనివల్ల నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

డే స్కాలర్లకు ఊరట..

కేవలం హాస్టల్ విద్యార్థులకే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 19 లక్షల మంది డే స్కాలర్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలామంది విద్యార్థులు సరైన పాదరక్షలు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి, వారికి ఒక జత బ్లాక్ షూస్, రెండు జతల సాక్సులు, ఒక బెల్ట్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో చెప్పులు లేకుండా పాఠశాలకు వచ్చే వేలాది మంది పేద విద్యార్థులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.

 

పారదర్శకంగా టెండర్లు.. బార్‌కోడింగ్‌తో పర్యవేక్షణ

ఈ భారీ పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం అత్యంత పారదర్శకమైన చర్యలు తీసుకుంటోంది. 24 వస్తువులను 9 కేటగిరీలుగా విభజించి ప్రత్యేకంగా టెండర్లను ఆహ్వానించింది. ఎంపికైన గుత్తేదారులు కేవలం 45 రోజుల్లోనే సరఫరా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి వస్తువుకు ఒక బార్‌కోడ్ కేటాయించడం ద్వారా పంపిణీ ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించనున్నారు. ప్రీ-బిడ్ సమావేశాల ద్వారా నాణ్యత విషయంలో రాజీ పడకుండా పక్కా ప్రణాళికతో విద్యా కానుకను సిద్ధం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *