ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL)లో నకిలీ ధ్రువపత్రాల కలకలం రేగింది. అర్హత లేకుండానే అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐటీఐ ఎలక్ట్రిషియన్ కోర్సు పూర్తి చేయకపోయినా చేసినట్లుగా తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి వీరంతా విధుల్లో చేరారు. విచారణలో వీరి మోసం బట్టబయలు కావడంతో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి కఠిన చర్యలకు ఆదేశించారు. సదరు ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు స్పష్టమైన నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఈ నకిలీ సర్టిఫికెట్ల ఉదంతం బయటపడటం శాఖలో చర్చనీయాంశంగా మారింది. షిఫ్ట్ ఆపరేటర్లుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు అసలు సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే విధుల్లో చేరడం వ్యవస్థ భద్రతకు ముప్పుగా పరిణమించింది. గత కొంతకాలంగా వీరి విద్యార్హతలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అంతర్గత విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. పక్కా ప్రణాళికతో దొంగ సర్టిఫికెట్లు తయారు చేయించి కొలువులు సాధించినట్లు అధికారులు నిర్ధారించారు.
జిల్లాల వారీగా తొలగింపుల వివరాలు..
ఈ వ్యవహారంలో అత్యధికంగా కడప జిల్లాకు చెందిన వారు ఉండటం గమనార్హం.
కడప జిల్లా: 38 మంది
కర్నూలు జిల్లా: 16 మంది
చిత్తూరు జిల్లా: 04 మంది
నెల్లూరు జిల్లా: 04 మంది
తిరుపతి జిల్లా: 03 మంది
అనంతపురం జిల్లా: 03 మంది
అన్నమయ్య జిల్లా: ఒకరు
మొత్తం 69 మందిపై వేటు వేయడం ద్వారా అక్రమాలకు తావులేదని అధికారులు సంకేతాలు పంపారు. కేవలం సర్టిఫికెట్ల తనిఖీతోనే ఆగకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది అంతా విధిగా మీసేవ కేంద్రాల ద్వారా పోలీస్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) సమర్పించాలని సీఎండీ ఆదేశించారు. క్రిమినల్ రికార్డులు ఉన్నా లేక తప్పుడు సమాచారం ఇచ్చినా సహించేది లేదని హెచ్చరించారు.
విద్యుత్ శాఖ వంటి అత్యంత ప్రమాదకరమైన రంగంలో అనుభవం లేని వారు నకిలీ పత్రాలతో చేరడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ ప్రక్షాళన మొదలుపెట్టింది. నిబంధనల ప్రకారం అర్హులైన వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. తప్పుడు మార్గాల్లో కొలువులు పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఈ చర్యలతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన మరికొంతమందిలో వణుకు మొదలైంది. ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిగినప్పటికీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సంస్థలపై కూడా నిఘా పెంచారు