తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ..

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. శాఖ చరిత్రలో తొలిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.44,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ శాఖకు అన్ని మార్గాల ద్వారా కలిపి మొత్తం రూ.44,557 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీ మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమం.

 

2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.40,209 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. దీని ద్వారా ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.39,368 కోట్ల ఆదాయం లభించింది. వీటికి అదనంగా, రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.1,771 కోట్లు, 1,214 బార్ల ద్వారా రూ.549 కోట్లు వచ్చాయి. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన దుకాణాల లైసెన్స్‌ల కోసం వచ్చిన దరఖాస్తుల రూపంలో నాన్‌-రిఫండబుల్‌ ఫీజు కింద మరో రూ.2,869 కోట్లు ఖజానాకు చేరాయి.

 

గత ఏడేళ్ల కాలంలో ఎక్సైజ్‌ ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం. 2018-19లో రూ.20,859 కోట్లుగా ఉన్న రాబడి, 2025-26 నాటికి రూ.44 వేల కోట్లను దాటింది. పరిమాణం పరంగా చూస్తే మద్యం (లిక్కర్) విక్రయాలు పెరిగినా, బీర్ల అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోలిస్తే బీర్ల విక్రయాలు 9 శాతం తగ్గి 387.34 లక్షల కేసులకు పరిమితమయ్యాయి. 2025 డిసెంబరులో పంచాయతీ ఎన్నికలు, నూతన సంవత్సర వేడుకల కారణంగా రికార్డు స్థాయిలో రూ.5,051 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *