ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మరో కొత్త సబ్-వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన BA.3.2 అనే ఈ వేరియంట్‌కు ‘సికాడా’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. తొలిసారిగా 2024 చివర్లో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్, క్రమంగా 23 దేశాలకు పాకింది.
ఏమిటీ ‘సికాడా’ వేరియంట్?
గతంలో 2022లో కనిపించిన BA.3 వేరియంట్ నుంచే ‘సికాడా’ పుట్టుకొచ్చింది. చాలాకాలం పాటు ఎలాంటి ఉనికి లేకుండా ఉండి, హఠాత్తుగా మళ్లీ తెరపైకి రావడంతో దీనికి ఈ పేరు పెట్టారు. దీని స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 నుంచి 75 కొత్త మ్యూటేషన్లు ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మార్పుల వల్ల గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా లభించిన రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం దీనికి ఉండవచ్చని అమెరికా సీడీసీ పేర్కొంది. అయినప్పటికీ, ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’ జాబితాలో చేర్చి, నిశితంగా గమనిస్తోంది.
లక్షణాలు, వ్యాక్సిన్ ప్రభావం
‘సికాడా’ లక్షణాలు చాలావరకు పాత ఒమిక్రాన్ వేరియంట్లను పోలి ఉన్నాయి. గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, అలసట, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటివి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. కొందరిలో వికారం, వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుత వ్యాక్సిన్లు JN.1, LP.8.1 వేరియంట్ల కోసం రూపొందించినప్పటికీ, ‘సికాడా’ సోకినా తీవ్రమైన వ్యాధి బారిన పడకుండా, మరణం ముప్పు నుంచి వ్యాక్సిన్లు బలమైన రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
భారత్‌లో ఆందోళన అవసరం లేదు
ప్రస్తుతానికి భారత్‌లో ‘సికాడా’ వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఈ వేరియంట్ కారణంగా కేసుల పెరుగుదల ఎక్కడా నమోదు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు కూడా స్వల్ప లక్షణాలతోనే ఉన్నాయని, సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని నిపుణులు సూచిస్తున్నారు.