చండీగఢ్‌లోని సెక్టార్ 37లో ఉన్న పంజాబ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెలుపల జరిగిన తీవ్రత కలిగిన పేలుడు కలకలం రేపింది. కార్యాలయం సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఒక స్కూటీలో ఈ పేలుడు సంభవించింది. తక్కువ తీవ్రత కలిగిన పేలుడు కావడంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ పేలుడు వెనుక లోతైన కుట్ర దాగి ఉందని, పంజాబ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అశ్విని శర్మనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ప్లాన్ చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక Xలో ఒక పోస్ట్ చేశారు.
గత రెండు రోజులుగా అశ్విని శర్మ అదే కార్యాలయంలో ఉంటూ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారని, ఒక రాజకీయ కార్యక్రమం నిమిత్తం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించడం గమనార్హమని ఆర్పీ సింగ్ పేర్కొన్నారు. “ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన, ఆందోళన కలిగించే విషయం. అశ్విని శర్మ గారు అక్కడి నుండి వెళ్లిన వెంటనే పేలుడు జరగడం వెనుక ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. దీన్ని కేవలం కాకతాళీయంగా కొట్టిపారేయలేం.” అని ఆయన తన పోస్ట్‌లో రాశారు.
మరో కీలక అంశాన్ని కూడా ఆర్పీ సింగ్ వెలుగులోకి తెచ్చారు. సరిగ్గా 15 రోజుల క్రితమే పఠాన్‌కోట్ ఎస్ఎస్పీ (SSP), అశ్విని శర్మకు ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆయనను హెచ్చరించారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లవద్దని అధికారులు ఆయనకు సూచించారని వెల్లడించారు. ఆ హెచ్చరికలకు, నేడు జరిగిన ఈ పేలుడుకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక నేత లేదా ఒక పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి మాత్రమే కాదని, పంజాబ్‌లో ఇంటెలిజెన్స్ సమన్వయం, శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని విమర్శించారు.
పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇలాంటి ఉగ్రవాద చర్యలను ఏమాత్రం సహించబోమని ఆర్పీ సింగ్ హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని త్వరగా గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. చండీగఢ్ పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పేలుడు జరిగిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, కీలకమైన బీజేపీ కార్యాలయం వద్దే ఇలాంటి ఘటన జరగడం పంజాబ్, చండీగఢ్ భద్రతా వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేసింది.