ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ..

తెలంగాణ రాష్ట్రంలో ఆటో రిక్షా కార్మికులు ఎదుర్కొంటున్న ఆటో ఎల్పీజీ కొరతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కి ఆయన ఒక లేఖ రాశారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, దీనివల్ల రాష్ట్రంలోని సుమారు లక్షకు పైగా ఆటో రిక్షా డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆయన లేఖలో వివరించారు.

 

తెలంగాణలో సుమారు 1.00 లక్ష ఎల్పీజీ ఆటో రిక్షాలు నడుస్తున్నాయని మంత్రి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ పంపిణీ నెట్‌వర్క్‌లో ప్రభుత్వ రంగ సంస్థలైన IOCL, HPCL, BPCL వాటా కేవలం 20 శాతం (33 అవుట్‌లెట్లు) మాత్రమే కాగా, ప్రైవేట్ ఆపరేటర్ల వాటా 80 శాతం (110 అవుట్‌లెట్లు) గా ఉంది. ప్రస్తుత సరఫరా ఆంక్షల వల్ల రోజుకు దాదాపు 55 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీ కొరత ఏర్పడిందని మంత్రి వెల్లడించారు. దీనివల్ల మెజారిటీ ప్రైవేట్ అవుట్‌లెట్లు మూతపడటంతో ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడమే కాకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ అయిన టోటల్ ఎనర్జీస్ వంటి సంస్థలు తమ అవసరాల్లో 80 శాతం సరఫరాను BPCL, HPCL నుండే పొందుతాయన్నారు. ప్రస్తుతం ఆ సరఫరా నిలిచిపోవడంతో కార్యకలాపాలు సాగించడం కష్టతరంగా మారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోవైపు ధరల విషయంలో కూడా భారీ వ్యత్యాసం ఉందని ఆయన ఎత్తిచూపారు. ప్రభుత్వ రంగ అవుట్‌లెట్లలో లీటర్ ఎల్పీజీ ధర రూ. 75 ఉండగా, ప్రైవేట్ సంస్థలు రూ. 93 కు విక్రయిస్తున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 

`ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తన లేఖలో ప్రధానంగా మూడు డిమాండ్లను కేంద్రం ముందుంచారు. ప్రభుత్వ రంగ సంస్థలైన‌ IOCL, BPCL , HPCL అవుట్‌లెట్లలో ఆటో ఎల్పీజీ లభ్యతను పెంచాల‌ని కోరారు. ప్రైవేట్ పంపిణీ సంస్థలకు ఎదురవుతున్న కొరతను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాల‌న్నారు. సంక్షోభ సమయాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా నియంత్రణ చర్యలు చేపట్టాల‌ని లేఖ‌లో కోరారు. త్వరగా ఈ సమస్యను పరిష్కరించడం వల్ల ప్రజా రవాణా సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని, వేలాది మంది ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *