ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రేపటి నుంచి (ఏప్రిల్ 1) రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా సుమారు 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. చేనేత రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ‘పవర్’ గిఫ్ట్ అందించింది.
ఈ పథకం కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు (పవర్ లూమ్స్) నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ. 150 కోట్లు వెచ్చించనుంది. ఈ రాయితీ వల్ల ఒక్కో చేనేత కార్మికుని కుటుంబానికి ఏడాదికి రూ. 8,640 వరకు, అలాగే పవర్ లూమ్ యూనిట్లకు ఏడాదికి రూ. 21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 93,000 చేనేత మగ్గాలు, 11,488 మరమగ్గాల కుటుంబాలకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలవనుంది.
గత కొన్నేళ్లుగా ముడి సరుకుల ధరల పెరుగుదల, మార్కెటింగ్ సమస్యలతో సతమతమవుతున్న చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే నేతన్నలకు ఇచ్చే నెలవారీ పెన్షన్‌ను రూ. 4,000లకు పెంచింది. అలాగే చేనేత సహకార సంఘాలకు రూ. 5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసింది. ఆధునిక యంత్రాల కొనుగోలుపై ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తూ నేతన్నలు ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తోంది. ముడి సరుకులపై 15 శాతం రాయితీతో పాటు నాణ్యమైన నూలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది.
చిన్న తరహా చేనేత క్లస్టర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 10.44 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా, నేతన్నలు తాము తయారు చేసిన వస్త్రాలను నేరుగా వినియోగదారులకు అమ్ముకునేలా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి నేతన్నలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. మగ్గాల నిర్వహణ, అల్లిక, డైయింగ్ వంటి పనులకు విద్యుత్ ఖర్చు అనివార్యమైన తరుణంలో, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత విద్యుత్ తోడ్పాటు చేనేత వృత్తికి వెన్నెముకగా నిలవనుంది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.