చిరుత సినిమా సమయంలో అసలు ఈయన హీరోనా అని హేళన పడ్డ రోజుల నుండి.. ఒక్కో మెట్టు ఎదుగుతూ తనలోని నటుడిని మలుచుకుంటూ.. రంగస్థలం సినిమాతో పూర్తిస్థాయి నటుడిగా మారే వరకూ రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతారామరాజు పాత్ర పోషించి మెప్పించిన రామ్ చరణ్.. నేడు పెద్ది సినిమాలో పహిల్వాన్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. రియల్ పహిల్వాన్ లుక్ లో మెస్మరైజ్ చేశారు. ఒకప్పుడు అలాంటి కామెంట్లు ఎదుర్కొని.. నేడు సినీ పరిశ్రమ ఆయన సినిమా కోసం ఎదురుచూసే స్థాయికి చేరుకున్నారు అంటే.. దీని వెనుక ఆయన పడ్డ కఠోర శ్రమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
పెద్ది కోసం పహిల్వాన్ లుక్..
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన “చికిరి చికిరి” పాటతో పాటు “రై రై రారా” పాటలు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.పైగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ పహిల్వాన్ గెటప్ ను రివీల్ చేస్తూ చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్కుకి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు తెరపై చూడాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ ఈ పహిల్వాన్ లుక్ కోసం పడిన కష్టానికి సంబంధించిన ఒక విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు రివీల్ చేశారు.
8 నెలల పాటూ రామ్ చరణ్ కఠోర శ్రమ..
“రూరల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలోని పహిల్వాన్ లుక్ కోసం రామ్ చరణ్ దాదాపు 8 నెలల పాటు కఠినమైన డైట్ , వర్కౌట్స్ చేశారు. ఆయన అయ్యప్ప దీక్షలో ఉంటూనే ఫిట్నెస్ నియమాలను ఎక్కడా బ్రేక్ చేయకుండా శ్రమించారు” అంటూ రామ్ చరణ్ కష్టాన్ని , కఠోర శ్రమను దర్శకుడు బుచ్చిబాబు బయటపెట్టారు. ఇక రామ్ చరణ్ ఈ లుక్ కోసం పడిన కష్టం విలువ తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఖచ్చితంగా ఇది 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అప్పుడే అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్ , దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.