నాయకులు, కార్యకర్తలంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు ఆదివారం బీజేపీలో చేరారు. కాగా వారికి రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయిందని, కేంద్రం కృషితోనే మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.
ఏప్రిల్ 6న..
కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఉందని విమర్శించారు. మత రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని, ప్రపంచంలో ఇంధన సంక్షోభం ఉన్నా.. భారత్‌లో కొరత లేదన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఏప్రిల్ 6న బీజేపీ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
132వ మన్ కీ బాత్ కార్యక్రమం
అనంతరం గన్‌ఫౌండ్రీ డివిజన్‌లో నిర్వహించిన ప్రధాని మోడీ 132వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రాంచందర్ రావు వీక్షించారు. అంనతరం ఆయన మాట్లాడుతూ.. మన్ కీ బాత్.. సామాజిక చైతన్యం, పర్యావరణ బాధ్యత, నీటి సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అనేక ముఖ్యమైన అంశాలపై ప్రజలకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందించిందన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు చెందిన రెండు ప్రేరణాత్మక ఉదాహరణలను ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వకారణంగా నిలిచిందన్నారు.
అదే స్ఫూర్తితో..
యువ భారత్ కార్యక్రమానికి సంబంధించి సూర్యాపేటకు చెందిన రఘువీర్ రెడ్డిని ప్రస్తావించడం యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అదేవిధంగా, మంచిర్యాల జిల్లాలో గ్రామీణ స్థాయిలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం జరుగుతున్న కృషిని ఆయన అభినందించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని రాంచందర్ రావు తెలిపారు. అదే స్ఫూర్తితో.. బీజేపీ కార్పొరేటర్ ‘గో గ్రీన్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, ప్రకృతికి మేలు చేసే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించాలనే సందేశం ప్రజల్లో మంచి స్పందన పొందుతోందన్నారు.