గత ప్రభుత్వం ఆర్టీసీనీ మూసేస్తామని.. నిర్వీర్యం చేసే కుట్ర చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీ విలీనం పై కమిటీ నివేదిక రావాల్సి ఉంది.. ఆనాడు ఆదరాబాదరాగా విలీనం ప్రక్రియ ప్రారంభించారని మండిపడ్డారు. ఆర్టీసీ పై 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై చర్చలో శనివారం మాట్లాడారు. బడ్జెట్లో ఆర్టీసీకి రూ.4305.49కోట్లు కేటాయించినందుకు సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ఏటా 1500 కోట్లు ప్రకటించి 10 ఏళ్లలో 7 వేల కోట్లు కూడా ఇవ్వలేదు.. మేము రెండేళ్లలోనే 7800 కోట్లు చెల్లించామన్నారు. మహాలక్ష్మీ ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు నడుపుతున్నాం.. వచ్చే రెండేళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామన్నారు. పేద వర్గాలకు ఆర్టీసీ లైఫ్ లైన్ అని, ప్రజా పాలన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను అక్కున చేర్చుకుందన్నారు.
Advertisement
మొత్తం 10,081 బస్సులు
ఆర్టీసీ లో 11 రీజియన్స్, 97 డిపోల ద్వారా రవాణా సేవల్ని అందిస్తోందని, మొత్తం 10,081 బస్సులు ఉన్నాయని, రోజుకు దాదాపు 35.19 లక్షల కిలోమీటర్లు నడుపుతోందని, 98% ఆక్యుపెన్సీతో రోజుకు సగటున 62.34 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి వివిధ కేడర్లలో 38,292 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత, సంస్థ లాభాలను ఆర్జించింది.
మొత్తం నష్టాలు రూ.12750.48 కోట్లు
2023-24 సంవత్సరంలో, సంస్థ రూ.104.10 కోట్ల లాభాన్ని సాధించగా, 2024-25లో రూ.2848.25 కోట్ల నష్టాన్ని చవిచూసిందని, ఈ నష్టం ప్రధానంగా ఆర్పీఎస్ 2017 బకాయిలకు రూ.3438.55 కోట్ల కేటాయింపులు చేశామన్నారు. 2025-26లో (ఫిబ్రవరి-2026 వరకు) సంస్థ రూ.954.86 కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని ఆర్జించిందని, ఉద్యోగులు,అధికారుల అవిశ్రాంత కృషి అన్నారు. 2014నుంచి ఇప్పటివరకు (ఫిబ్రవరి 2026) సంస్థ మొత్తం నష్టాలు రూ.12750.48 కోట్లు అన్నారు. నవంబర్ 2023 నాటికి పీఎఫ్ బకాయిలు (అసలు) రూ.1205 కోట్లు ఉండగా అవి ఇప్పుడు రూ.680 కోట్లకు తగ్గించామన్నారు. సీసీఎస్ బకాయిలు (అసలు) రూ.690 కోట్ల నుంచి రూ.345 కోట్లకు తగ్గించామని తెలిపారు. ఈ ఏడాది మార్చి 18వరకు 286.60 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి మహిళా ప్రయాణికులు రూ.9871.32 కోట్ల రవాణా ఛార్జీలను ఆదా చేసుకున్నారని వెల్లడించారు.
394 ప్రైవేట్ ఏజెంట్లను
ఆర్టీసీలో మృతి చెందిన ఉద్యోగులపై ఆధారపడిన 829 మందికి బ్రెడ్ విన్నర్ పథకం కింద నియామకాలు చేశామని, మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం కింద మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులపై ఆధారపడిన 305 మందికి నియామకాలు చేశామని తెలిపారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, పెద్దపల్లి వద్ద కొత్త బస్సు డిపోల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మార్గాల్లోని కీలక కూడళ్ల వద్ద సంస్త ఇప్పటివరకు 364 బస్సు స్టేషన్లను నిర్మించిందని తెలిపారు. 24 బస్ స్టేషన్లలో కార్గో , పార్శిల్ సర్వీస్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 394 ప్రైవేట్ ఏజెంట్లను కూడా నియమించినట్లు తెలిపారు. హైదరాబాద్ లో కొత్తగా 340 రూట్లలో బస్సులు నడుపుతుందని, సర్వీసు నుంచి పూర్తిగా రిమూవ్ అయిన వారికి 250 మందిని తిరిగి సర్వీసులోకి తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లో రవాణా కనెక్టివిటీ పెంచడానికి మెట్రో ఎంఎంటీఎస్ తో కలిసి ఆర్టీసీ ముందుకు పోతుందన్నారు.
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అదిలాబాద్ , కరీంనగర్ , ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో అసెంబ్లీ కమిటీ హాల్ -1 లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అన్ని జిల్లాలో నియోజకవర్గాల వారిగా ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్స్ , మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బస్ స్టేషన్ అభివృద్ధిలో ఆర్టీసీ తో ఎమ్మెల్యేలు తమ ఫండ్స్ ద్వారా సహకరించాలని కోరారు. కొత్త వస్తున్న బస్సులు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి అక్కడకి పంపిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కొత్త రూటులో బస్సులు పంపించడానికి యాక్షన్ ప్రాన్స్ సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులతో లు ఆర్టీసీ అధికారులు ప్రజాసంబంధాలు కలిగి ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వహిస్తే ఆ చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కరీంనగర్ ఆదిలాబాద్ , ఖమ్మం ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, డా,, సంజయ్ కుమార్,కౌశిక్ రెడ్డి ,మేడిపల్లి సత్యం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రమణ రావు , వెడ్మా బొజ్జు,కోవా లక్ష్మీ ,అనిల్ జాదవ్ , రామారావు పటేల్ ,పాల్వాయి హరీష్ బాబు ,పాయం వెంకటేశ్వర్లు ,రాందాస్ నాయక్ , జారే ఆది నారాయణ, కోరం కనకయ్య ,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ఎం లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.