పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్న తరుణంలో, భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిస్థితులను నిశితంగా సమీక్షించేందుకు.. దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ ప్యానెల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రాథమికంగా యుద్ధం వల్ల అంతర్జాతీయ చమురు సరఫరా గొలుసుపై పడే ప్రభావం, భారతదేశ ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వంపై చర్చించనుంది. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ కమిటీ వ్యూహాలను రూపొందిస్తుంది.
పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడిందని, దీనివల్ల అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు ఊరటనిచ్చేలా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో ధరలను నియంత్రణలో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇది మోదీ ప్రభుత్వ ప్రజల-కేంద్రీకృత పాలనకు నిదర్శనమని అమిత్ షా అభివర్ణించారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ధరలను పెంచి చేతులెత్తేసిన తరుణంలో, భారత్ తన పౌరుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని ఆయన కొనియాడారు. ఇంధనంపై పన్నులు తగ్గించడం వల్ల సామాన్యులకు ఎంతో ఉపశమనం లభించిందని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
యుద్ధం వల్ల చమురు దిగుమతులు తగ్గకుండా ఉండేందుకు భారత్ ఇప్పటికే తన ఇంధన వ్యూహాన్ని మార్చుకుంది. రష్యా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుండి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కమిటీలో ఉండటం వల్ల, పెరగబోయే రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అవసరమైన ఆర్థిక ప్యాకేజీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల దేశంపై ఆర్థిక భారం పడకుండా ఉండటమే లక్ష్యంగా కేంద్రం ఈ మంత్రుల ప్యానెల్‌ను రంగంలోకి దించింది. ఇటు దేశ రక్షణ, అటు ఆర్థిక వ్యవస్థ రెండింటినీ సమతుల్యం చేస్తూ భారత్ అడుగులు వేస్తోంది.