మైనర్లు వాహనం నడిపి ప్రమాదాలకు కారణం ఐతే తల్లి తండ్రులకు శిక్ష తప్పదు.

తేది:25-03-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.

నల్గొండ జిల్లా :నల్గొండ పట్టణంలో సాంఘిక సంక్షేమ పాఠశాల లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు
నల్గొండ జిల్లాలో రోడ్ ప్రమాదాలను అరికట్టుటలో బాగంగా, జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ గారి ఆదేశానుసారం ఈ రోజు వన్ టౌన్ పోలీస్ వారు SLBC లో గల స్థానిక సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మితిమీరిన వేగం, అజాగ్రత్త వల్ల అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
సదస్సులో ఇన్‌స్పెక్టర్ గారు సూచించిన ముఖ్య అంశాలు:
హెల్మెట్ ధారణ: ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ఐఎస్ఐ (ISI) ముద్ర ఉన్న హెల్మెట్ ధరించాలి.
లైసెన్స్ నిబంధన: మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, 18 ఏళ్లు నిండిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు.
సెల్ ఫోన్ డ్రైవింగ్: వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
ట్రాఫిక్ సిగ్నల్స్: రెడ్ లైట్ పడినప్పుడు వాహనం ఆపడం, జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటడం వంటి ప్రాథమిక నియమాలను విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు.
“విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను తెలుసుకోవడమే కాకుండా, తమ తల్లిదండ్రులకు మరియు ఇరుగుపొరుగు వారికి కూడా అవగాహన కల్పించాలి. క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ మీ కుటుంబానికి రక్షణ,” అని రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ ఐ లచ్చి రెడ్డి, సిబ్బంది అంజయ్య, మధుసూదన్ రెడ్డి శ్రీను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *