ఏపీలో క్రెడిట్ చోరీ కంటిన్యూ చేస్తున్న వైసీపీ..! మిట్టల్ స్టీల్ ప్లాంట్ మావల్లే- మాజీ మంత్రి అమర్నాథ్..

వైసీపీ ట్రెండ్ మార్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా దాని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసింది.. చేస్తూనే ఉంది. తాజాగా అర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ విషయంలో కూడా అదే చేసింది. మిట్టల్ స్టీల్‌ప్లాంట్ అనకాపల్లికి రావడానికి ప్రధాన కారణం జగన్ అని తేల్చిచెప్పింది ఆ పార్టీ.

 

ఏపీలో క్రెడిట్ చోరీ కంటిన్యూ చేస్తున్న వైసీపీ

 

మంగళవారం విశాఖలో మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. అర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి రావడానికి ప్రధాన కారణం జగన్ అని తేల్చి చెప్పారు. గతంలో దావోస్‌కి వెళ్లినప్పుడు స్టీల్‌ప్లాంట్ కోసం ఆదిత్య మిట్టల్‌తో అప్పటి సీఎం జగన్ సంప్రదింపులు జరిపారని కొత్త విషయాన్ని బయటపెట్టారు.

 

గ్రీన్ కో ప్రాజెక్ట్‌తోపాటు స్టీల్‌ప్లాంట్ ను ఏపీలో పెట్టాలని ఆనాడు జగన్ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు 3 నుంచి 4 వేల ఎకరాల భూమి కావాలని ఆదిత్య మిట్టల్ కోరారని అన్నారు. వారి కోరిక మేరకు కాకినాడ సమీపంలోని ములపేట, నక్కపల్లి ప్రాంతాల్లో భూములు చూపించడం జరిగిందన్నారు.

 

మిట్టల్ స్టీల్ ప్లాంట్ మావల్లే వచ్చింది- మాజీ మంత్రి అమర్నాథ్

 

2024 ఎన్నికలకు నోటిఫికేషన్ ముందు స్టీల్‌ప్లాంట్ కోసం నక్కపల్లి దగ్గర స్థలం కావాలని కోరారని ఈ సందర్భంగా వివరించారు. వైజాగ్ సిటీలో ఇన్నార్ బిట్‌మాల్, బల్క్ డ్రగ్ పార్క్‌ను తీసుకురావడం వెనుక జగన్ చేసిన కృషిని మరువలేమన్నారు. జగన్ తెచ్చిన బల్క్‌డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు.

 

పార్క్ కోసం అక్కడున్న ప్రజలను కూటమి ప్రభుత్వం ఒప్పించలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల 35 వేల మందికి ఉపాధి కల్పించే ఈ పార్క్ అయోమయంలో పడిందన్నారు. మరి 32 మంది ప్రాణత్యాగంతో వచ్చిన స్టీల్‌ ప్లాంట్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎందుకు కాపాడులేకపోతున్నారని ప్రశ్నించారు.

 

కూటమి ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ 6,500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

 

అదే సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గురించి కూడా ప్రస్తావించారు మాజీ మంత్రి. షర్మిల తన అవసరాల కోసం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయవద్దని హితవు పలికారు. ఈ విషయంలో చంద్రబాబు ఎవరి చేతిలో రాజకీయ పావుగా మారవద్దని సూచన చేశారు. మీరు చేసిన ఆరోపణలపై పార్టీ కార్యకర్తల నుంచి మా మీద విపరీతమైన ఒత్తిడి ఉందన్నారు. అధినేత జగన్ మా నోటిని కట్టడి చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో మా అధినేత చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. మిగతా రాజకీయ పార్టీ నాయకులకు ఎలా సమాధానం చెబుతామో మీకు అలాగే చెప్పామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *