ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే మా ప్రాధాన్యత : భట్టి..

విద్యుత్ శాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేశ్, ముక్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బాధిత కుటుంబాలకు తామున్నామనే భరోసా నింపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి పది లక్షలకు పెంచినట్లు సీఎం తెలిపారు. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడొద్దని కుటుంబ బీమా తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. విద్యుత్, సింగరేణి కార్మికులకు రూ.కోటికి పైగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని వివరించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

 

ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే మా ప్రాధాన్యత : భట్టి

ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశ చరిత్రలోనే ఇదొక చారిత్రక కార్యక్రమమని, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందని, యజమానిపై ఆధారపడిన జీవితాలు తారుమారవుతున్న తీరును తాము గమనించామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇలాంటి నిస్సహాయ స్థితి రాకూడదన్న మానవీయ ఆలోచనతోనే, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.1.20 కోట్ల భారీ ప్రమాద బీమాను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ప్రకటించారు.

 

రూ.కోటి చొప్పున బీమా

ఈ ప్రమాద బీమా పథకం ద్వారా విద్యుత్ సంస్థల్లోని 51 వేల మందికి పైగా, సింగరేణి సంస్థలోని 41 వేల మంది, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 7.57 లక్షల మంది కుటుంబాల్లో ఈ పథకం భరోసాను కల్పిస్తుందని వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణి, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో సంస్థల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించామని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఈ క్రమంలోనే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో అసిస్టెంట్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తూ 2025 అక్టోబర్ 10న మరణించిన వరుస సురేష్, అలాగే మహబూబ్ నగర్ సర్కిల్ సివిల్ విభాగంలో ఆర్టిజన్ గా పనిచేస్తూ 2025 ఏప్రిల్ 19న మరణించిన ముక్తార్ బేగ్ కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా చెక్కులను అందజేసి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు.

 

రూ.5 లక్షల చొప్పున రక్షణ

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీరి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇదిలా ఉండగా సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రక్షణ కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, అజారుద్దీన్, ఎనర్జీ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *