తేది:23-03-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్.
వికారాబాద్ జిల్లా: విద్యాశాఖ ఆధ్వర్యంలో, శిక్షణ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో వికారాబాద్ మండలం కొత్తగడి కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక పాఠశాల మధన్పల్లి విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి గిట్టి బహుమతిని సాధించారు. తమ ప్రతిభతో పాఠశాల పేరును జిల్లా స్థాయిలో నిలబెట్టారు.
ఈ పోటీలలో వికారాబాద్, పరిగి, దారూర్, పూడూర్, యాలాల మండలాలకు చెందిన రెండువందలకుపైగా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తీవ్రమైన పోటీ మధ్య మధన్పల్లి విద్యార్థులు జ్ఞానపరమైన నైపుణ్యాలు, వేగవంతమైన స్పందనతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హారిక గారు, ఉపాధ్యాయురాలు వరలక్ష్మి గారు విద్యార్థులను అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. శిక్షణ ఫౌండేషన్ మెంటర్ లక్ష్మీనారాయణ గారి మార్గదర్శకత్వం విద్యార్థుల విజయంలో కీలకంగా నిలిచిందని తెలిపారు.
మెంటర్ లక్ష్మీనారాయణ గారు విద్యార్థులకు సాధారణ జ్ఞానం, తార్కిక ఆలోచన, విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించే విధంగా ప్రత్యేక శిక్షణ అందించారు. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించడం, ప్రశ్నలపై లోతైన అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులను పోటీలకు సన్నద్ధం చేశారు. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ గారి కృషిని కొనియాడుతూ, శిక్షణ ఫౌండేషన్ సేవలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.