కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు సరఫరా చేసే వాటాను భారీగా పెంచింది. ప్రస్తుతం అందుతున్న కోటాకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్‌ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఈనెల 23వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు ఇంధన కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఈ అడుగు వేసింది.
కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. గతంలోనే కేంద్రం 10 శాతం మేర సరఫరాను పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాజాగా ప్రకటించిన 20 శాతం కోటా గతంలో పెంచిన దానికి అదనమని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల వ్యాపార వర్గాలకు గ్యాస్ కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సిలిండర్ల కొరత కారణంగా ధరలు పెరగకుండా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
ముఖ్యంగా ఆహార రంగంపై ఆధారపడిన చిన్న వ్యాపారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, రహదారి పక్కన ఉండే దాబాలకు నిరంతరాయంగా గ్యాస్ అందేలా చూడాలని నీరజ్ మిట్టల్ తన లేఖలో పేర్కొన్నారు. పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, పాడి పరిశ్రమలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నడిపే రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లకు గ్యాస్ కొరత రాకుండా పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సూచించారు.
గ్యాస్ పంపిణీ వ్యవస్థలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని కేంద్రం ఆదేశించింది. వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ వినియోగించే అవుట్లెట్లకు సిలిండర్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పారిశ్రామిక అవసరాల కోసం గ్యాస్ వినియోగం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంధన సరఫరాలో సమతుల్యత పాటించడం ద్వారా ఆహార ధరలు పెరగకుండా కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.