తేది:21-03-2026 హనుమకొండTSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా వర్ధన్నపేట పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక ప్రార్థనల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు పలుగురికి ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, క్రమశిక్షణ, దానగుణం, సోదరభావానికి రంజాన్ పండుగ ప్రతీక అని కొనియాడారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్ పండుగ చివరి రోజు పండుగను జరుపుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా గడుపడం సంతోషకరంగా ఉందన్నారు. ఈద్గాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి వసతులు కల్పించడం జరిగిందన్నారు.మైనార్టీల ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. రంజాన్ కానుకగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మైనార్టీ వర్గానికి కేటాయించిన నూతన గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని, రంజాన్ పర్వదినాన ఆ కుటుంబాన్ని కొత్త ఇంటిలోకి పంపడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.