తేది:20-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా :ఝరాసంగం మండలం లో సిద్ధాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల కురిసిన అకాల వర్షాలు, గాలివానలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. సిద్ధాపూర్ గ్రామంలోని రైతులు సాగు చేసిన జొన్న పంటలు చేతికి వచ్చే తరుణంలో ప్రకృతి ప్రకోపానికి గురవ్వడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా సిద్ధాపూర్ గ్రామానికి చెందిన రైతు రాములు తన పొలంలో ఎంతో కష్టపడి జొన్న పంటను సాగు చేశారు. పంట బాగా పండి, మరికొద్ది రోజుల్లో కోతకు వస్తుందనుకుంటున్న తరుణంలో కురిసిన భారీ వర్షానికి జొన్న చేను పూర్తిగా నేలకొరిగింది.
విత్తనాలు, ఎరువులు, మరియు కూలీల కోసం రాములు వేల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు పంట మొత్తం నీటిపాలవ్వడంతో అసలు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలివాన ధాటికి గింజ నల్లబడటం లేదా మొలకలు వచ్చే ప్రమాదం ఉండటంతో మార్కెట్లో ఈ పంటకు సరైన ధర లభించదని రైతు వాపోతున్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రాములు వంటి సామాన్య రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన జొన్న చేనును పరిశీలించాలని.
పంట నష్టం అంచనా వేసి, బాధిత రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
”ఏడాది పొడవునా కష్టపడి సాగు చేసిన పంట, చేతికి వచ్చే సమయంలో ఇలా కళ్లముందే నేలపాలవ్వడం గుండెను కలచివేస్తోంది” అని రైతు రాములు కన్నీటి పర్యంతమయ్యారు.