కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ సమేతంగా ఎంతో సంతోషంగా జరుపుకున్నారని పేర్కొన్న ఆమె, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు. పండుగ పూట చంద్రబాబు భార్య హెరిటేజ్‌లో పాలు పిసుకుతున్నారా? అంటూ రోజా అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తీరుపై కూడా రోజా మండిపడ్డారు. తిరుమలలో ఉగాది వేడుకలను పర్యవేక్షించకుండా ఆయన ఎక్కడికి పోయారని నిలదీశారు. పండుగ రోజున కూడా పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని, రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారని ఆమె ఆరోపించారు. పండుగ రోజున ప్రజల మధ్య ఉండాల్సిన నాయకులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ఆడబిడ్డ నిధి’ వంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆమె దుయ్యబట్టారు.