ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా ఉందని హరీష్ రావు అభివర్ణించారు. దీనిని ఒక ‘బోగస్ బడ్జెట్’ గా పేర్కొంటూ, కేవలం అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఈ బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవని, ముఖ్యంగా మైనారిటీలకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులనే ఖర్చు చేయలేదని, ఇప్పుడు మళ్ళీ అవే అబద్ధాలను వల్లెవేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే సుమారు రూ. 3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అప్పులు తెచ్చి కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించామని, మరి రేవంత్ సర్కార్ తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌కు పథకాల కంటే కుంభకోణాల పైనే ఎక్కువ శ్రద్ధ ఉందని ఎద్దేవా చేస్తూ, ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలకు దక్కింది కేవలం ‘సున్నా’ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆరు హామీల అమలుపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ‘CURE, PURE, RARE’ పేరుతో ప్రజలతో మూడు ముక్కలాట ఆడుతోందని, తద్వారా తెలంగాణను మరియు హైదరాబాద్‌ను విడగొడుతున్నారని ఆరోపించారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన తన విమర్శల్లో పేర్కొన్నారు.