దీదీ 10 ప్రతిజ్ఞలు: ‘లక్ష్మీర్ బండార్’ పెంపుతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల.. మహిళలు, యువతకు వరాల జల్లు!

పశ్చిమ బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా మమతా బెనర్జీ ‘బంగ్లార్ జొన్నో దిదీర్ 10 ప్రతిజ్ఞ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ప్రణాళికలో సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన ‘లక్ష్మీర్ బండార్’ పథకం కింద మహిళలకు ఇచ్చే నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ. 500 పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల జనరల్ కేటగిరీ మహిళలకు నెలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 1700 నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి.

మహిళలతో పాటు యువత, రైతులను ఆకట్టుకునేలా భారీ హామీలను టీఎంసీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ‘బంగ్లార్ యువ సాథి’ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ. 1500 ఆర్థిక సాయం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ. 30,000 కోట్లతో ప్రత్యేక అగ్రి బడ్జెట్ ప్రవేశపెడతామని వాగ్దానం చేశారు. వీటితో పాటు ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు, ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు, మరియు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వంటి కీలక అంశాలను ఈ 10 ప్రతిజ్ఞల్లో చేర్చారు.

మేనిఫెస్టో విడుదల సందర్భంగా మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో ప్రస్తుతం అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తోందని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ఆర్సీ, సెన్సస్ పేరుతో పౌరసత్వాన్ని హరించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని, బెంగాల్‌ను తూర్పు భారత్ వాణిజ్య ముఖద్వారంగా మారుస్తామని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *