ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట.. కొత్త పార్టీ పేరు ఖరారు..

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. తన సామాజిక సంస్థ ‘జాగృతి’ని రాజకీయ పార్టీగా మారుస్తూ “తెలంగాణ ప్రజా జాగృతి” అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తుగా “ధర్మగంట”ను ఎంచుకున్న కవిత.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆమెకు ఊరట లభించింది. పార్టీ పేరు.. గుర్తు కేటాయింపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. సాంకేతిక లోపాలను సరిదిద్ది మళ్లీ దరఖాస్తు పంపినట్లు కవిత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన ఈసీ.. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది.

 

ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఈ నెలలోనే కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. రానున్న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పార్టీ పేరు.. గుర్తును అధికారికంగా అనౌన్స్ చేయాలని ఆమె భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖుల సమక్షంలో పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు. నిజామాబాద్.. ఖమ్మం.. మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో తన జాగృతి సంస్థకు ఉన్న బలమైన పట్టును రాజకీయ శక్తిగా మార్చుకోవాలని ఆమె ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 

మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో కవిత తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సర్వోదయ తెలంగాణ” స్థాపనే తమ ప్రధాన లక్ష్యమని.. తమ పోరాటం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఖమ్మం వెలుగుమట్ల ఇష్యూలో తమ జోక్యం వల్ల 300 మంది బాధితులకు మేలు జరిగిందని ఆమె గుర్తు చేశారు. తమకు ప్రత్యేక అజెండా ఏమీ లేదని.. ప్రజలే తమ అజెండా అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తమ ఐడియాలజీకి సరిపోయే పార్టీలను.. వ్యక్తులను కలుపుకుని ముందుకు వెళ్తామని వెల్లడించారు. తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కవిత ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

 

పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే దేశవ్యాప్తంగా పర్యటించి వివిధ రంగాల నిపుణులను.. రాజకీయ నేతలను కలవనున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై తనదైన శైలిలో గళమెత్తేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జాగృతి కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ.. రాబోయే ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపేందుకు కవిత పక్కా స్కెచ్ వేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుండటం ఆమె మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *