ఏపీలో రాబోయే 3 రోజులు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..!

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉంటుంద‌ని.. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచించారు.

 

వాతావ‌ర‌ణ శాఖ అధికారుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం నాటికి వర్షాల ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపించడంతో ప్రజలు ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే సాయంత్రం సమయానికి ఆకాశం మేఘావృతమై చల్లబడటంతో ఉపశమనం లభించినా, ఈదురుగాలులు మాత్రం బీభత్సం సృష్టించాయి. జీయమ్మవలస మండలం సింగనాపురం పరిసరాల్లో గాలుల ధాటికి చెట్లు విరిగిపడటంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. గాలివేగం ఎక్కువగా ఉండటంతో జనజీవనం స్తంభించిపోయింది.

 

రాబోయే గంటల్లో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పొలాల్లో పనుల్లో ఉండే రైతులు, ప్రయాణికులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలని, పశువులను సురక్షిత కట్టడాల్లో ఉంచాలని సూచిస్తున్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *