పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వాసితులతో సమావేశమైన ఆయన, పునరావాస ప్యాకేజీ (R&R) కింద మూడో విడతగా రూ. 226.61 కోట్ల నిధులను విడుదల చేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం సాకారం కావడంలో వీరి త్యాగమే పునాది అని ఆయన కొనియాడారు.
గత 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు అండగా నిలిచిన తీరును సీఎం వివరించారు. మూడు విడతల్లో కలిపి మొత్తం 26,149 మంది నిర్వాసితులకు రూ. 1,943 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు. ఇందులో సంక్రాంతి కానుకగా రూ. 800 కోట్లు, దీపావళికి రూ. 916 కోట్లు అందించామని గుర్తు చేశారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రాం వాల్ దెబ్బతిని ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించిన సీఎం, ప్రస్తుతం రూ. 1000 కోట్లతో కొత్త వాల్ నిర్మిస్తున్నామని, వారం రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయని ప్రకటించారు.
ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావాసాన్ని వేగవంతం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 2027 ఏప్రిల్ నాటికి నిర్వాసితులందరికీ పక్కా ఇళ్లతో పునరావాసం కల్పిస్తామని, ఇందుకోసం ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ. 3.5 లక్షలకు, స్థల పరిహారాన్ని రూ. 2 లక్షలకు పెంచామని తెలిపారు. వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండటంపై పలువురు నిర్వాసిత మహిళలు భావోద్వేగానికి గురై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.