సలార్ ఫస్ట్ టికెట్ కొన్న స్టార్ దర్శకుడు..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.

 

సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్.. మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.

 

నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సినిమా రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లల్లో వంద రూపాయల మేర అదనంగా టికెట్ రేటును పెంచుకోవాలని ప్రతిపాదించింది.

 

Salaar

అలాగే- సినిమా విడుదల రోజైన డిసెంబర్ 22వ తేదీన ఆరు ఆటలకు అనుమతి ఇవ్వాలనీ కోరింది. నైజాం ఏరియా వ్యాప్తంగా కూడా సలార్ తొలి షోను తెల్లవారు జామున 4 గంటలకే ప్రదర్శించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అలాగే కొన్ని ప్రధాన స్క్రీన్లపై అర్ధరాత్రి ఒంటిగంటకే షోను ప్రదర్శించడానికి అనుమతులను కోరింది మైత్రీ మూవీస్ సంస్థ.

 

కాగా ఈ సినిమా టికెట్ల బుకింగ్ మొదలైంది. తొలి టికెట్‌ను స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి కొన్నారు. ఫ్రీగా మాత్రం కాదు. ఏకంగా 10,116 రూపాయలు పెట్టి మరీ టికెట్ కొన్నారాయన. హీరోలు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్, నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీస్ సునీల్ ఎర్నేని ఈ టికెట్‌ను ఆయనకు అందజేశారు.

 

Salaar

శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో ఈ సినిమాను చూడబోతోన్నారు రాజమౌలి. ఆయనకు కేటాయించిన సీట్ నంబర్ ఏ1. ఆయనతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్, సునీల్ ఎర్నేని కలిసి సినిమా చూసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *